Monday, 1 December 2014

Yeksha presnalu






72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)
7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
(పెద్దలను సేవించుటవలన)
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
(అధ్యయనము వలన)
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన
సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల
అసాధుభావము సంభవించును.)
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
( మౄత్యు భయమువలన)
12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ,
అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
13. భూమికంటె భారమైనది ఏది? (జనని)
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)
15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల
ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
( యజ్ణ్జం చేయుటవలన)
21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)
22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని
రక్షించక పోవడంవలన)
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)
26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)
28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)
29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)
30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)
39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,
ఆకాశములందు)
43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)
45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం,
క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ
దు:ఖాలను సమంగా ఎంచువాడు)
50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)
51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)
56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా
చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)
60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)
62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన
భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది
గొప్పవాడవుతాడు)
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
(సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో
తిని తౄప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం?
(ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే
శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
(ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని
సమంగా చూసేవాడు)
72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ,
శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,
సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై
ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

Saturday, 12 October 2013

Dharma Aapeksha



ఇప్పటి కాలంలో ఇప్పటి సామాజిక పరిస్థితులని చూస్తూ ఉంటే మన సనాతన ధర్మానికి మనుగడ ఉందా?

 అనేటువంటి ఆశంక కలుగుతోంది. ఎందుకంటే పరిస్థితులు అంత భీకరంగా ఉన్నాయి.

 ధర్మ విరోధులైన వారు ప్రబలుతూ ఉన్నారు. ధర్మాన్ని ఆచరించే వారికి రక్షణ కొరవడుతోంది. మరి ఈ పరిస్థితిని

మనం అధిగమించేది ఎలా? మన సనాతన ధర్మం ఇప్పటికంటే ఎన్నో విషమ పరిస్థితులను ఎదుర్కొని కూడా

తనయొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది.

 అటువంటి అత్యంత బలవత్తరమైన అస్తిభారంతో(ఫౌండేషన్) ఉన్నటువంటిది మన ధర్మం. ఒక కట్టడం యొక్క

అస్తిభారం అతి ప్రబలంగా ఉంటే ఆ కట్టడాన్ని ఎవరూ ఏమీ చేయడానికి వీలు ఉండదో అదే విధంగా మన ధర్మం

వేదంలో ప్రతిపాదితమైన ధర్మం. అందుకే దీనిని వైదిక ధర్మం అని మనం చెప్తూ ఉన్నాము.

 దీని మూలం వేదములు. ఈశ్వరునితో ఉపదేశించబడినటువంటి వేదములందు ప్రతిపాదించబడిన ధర్మం కాబట్టి

ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పటి భాషలో చెప్పాలంటే టెన్షన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉన్నది కానీ ఈ

ధర్మం లోపిస్తుందా? అనే భావన మనకి అనవసరం.

 ఎందుకు అంటే ఈ ధర్మానికి పెట్టని గోడలలాగా ఉన్నాయి మన దేవాలయాలు. ఒక్క ఆంద్ర దేశంలోనే 36,౦౦౦

దేవాలయాలున్నాయి. మొత్తం భారతంలో లక్షలకు లక్షలు ఉన్నాయి. ఇవి మన ధర్మానికి ఆధార భూతమైనవి.

వైదేశికుల ఆక్రమణ, మతాంతరం అని కొంతమంది, మనయొక్క ధర్మాన్ని వికృతంగా ప్రతిపాదిస్తున్నారు

కొంతమంది అని, అంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో కూడా తిరుపతికి, శబరిమలకి వెళ్ళే యాత్రికుల సంఖ్య

ఏమాత్రం తక్కువైందా?? మీరు చేసే విపరీతమైన వ్యాఖ్యానాలు కానీ ఈ వైదేశికుల దౌష్ట్యం కానీ ఈ యాత్రీకుల

మీద ఏమైనా పరిణామం చేసిందా? ఇవ్వాళ కాలేదు ఇకముందు కాబోదు. వాళ్ళు కేవలం తమ జిహ్వాచాపల్యం

 తీర్చుకోవడానికి మన ధర్మాన్ని వికృతం చేసి మాట్లాడి ఉండవచ్చు. 

అంతమాత్రంతో మనధర్మాన్ని అనాది పరంపరగా అనుష్టిస్తూ ఉన్న వాళ్ళ మనస్సులను వాళ్ళు మారుస్తారు అని

 మనం ఎన్నడూ మనం అనుకోవక్కరలేదు. తిరుపతిలో ఉండే వేంకటేశ్వరుడు, కాశీలో ఉండే విస్వనాధుడు,

ఈవిధంగా భగవంతుడు ఎక్కడెక్కడైతే తన సాన్నిధ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడో ఆ ప్రదేశములన్నీ ఎన్నివేల

 సంవత్సరాలైనా మనయొక్క శ్రద్ధా కేంద్రములుగా ఉండనే ఉంటాయి..దానిలో సందేహించనవసరం లేదు.

 కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనం అర్ధం చేసుకోవాలి. ధర్మం నశించి పోతున్నది, ధర్మాచరణ చేసేవారు

తక్కువై పోతున్నారు అని అనేకమంది ఒక్క మాట అంటున్నారు. ఈ ధర్మాచరణలో తానుకూడా ఒకడిని అని

మరుస్తున్నారు. ఈ చెప్పేవాళ్ళు నేను సరిగా ధర్మాచరణ చేస్తున్నానా లేదా అని ఒక ప్రశ్న చేసుకోవాలి? ఇంకొకడి

 విషయం మీకు అనవసరం. 

మీరు కనీసం త్రికాలసంధ్యావందనం చేస్తున్నారా? పరిశేచన మంత్రం మీకు సరిగ్గా వచ్చునా? ఈ ప్రశ్నకు మీరు

సరిగా సమాధానం చెప్పండి. ఇతరులను నిలదీసి అడగడానికి ముందు మిమ్మల్ని నేను ప్రశ్న వేస్తున్నాను

ధర్మాచరణ మీరు చేస్తున్నారా? వేదాంతంలో శాస్త్రాన్ని తెలియజెప్పటానికి ఒక దృష్టాంతం చెప్తారు.

న మే పార్థాస్తి కర్తవ్యమ్ త్రిషు లోకేషు కించన!
నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి!!
యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః!!
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్
సంకరస్య చ కర్తా సాముపహన్యామిమాః ప్రజాః!!

నాయనా! చేయాల్సిందీ పొందాల్సిందీ నాకు ఏదీ లేదు. కానీ నా కర్తవ్యాన్ని నేను చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను చేయకపోతే మిగతా ఎవరూ చేయరు. నేను చేయలేదని మిగిలిన వారు మానేశారంటే వాళ్లకి చాలా అనర్ధం జరుగుతుంది. వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి నేను చేస్తున్నాను. లేకపోతే కర్మభ్రష్టులై వారు నరకానికి పోవలసి ఉంటుంది.భగవంతుడే ఎప్పుడైతే ఈమాట చెప్పాడో సామాన్యులమైన మనబోటి గాళ్ళం ఎదుటివాడికి చెప్పడానికి అధికారం ఎక్కడ వస్తుంది? "స్వయం తీర్ణః పరాం స్తారయతి" అన్నారు పెద్దలు. నువ్వు ఒడ్డుకు చేరి ఇంకొకరిని చేర్చు. మన స్వధర్మాన్ని మనం పరిపాలించాలి అని భావన కలిగి ఉండి ఇతరులకి చెప్పాలి.విదేశీయుల పరిపాలనలో వందలాది స౦!! మనం ఉన్నాం. అయినప్పటికీ మన ధర్మానికి ఏమైనా అయిందా? అప్పట్లో ఉన్నంత మంది వేదపండితులు ఇవ్వాళ లేరు. అది శోచనీయం. అప్పట్లో లేనివి ఇప్పట్లో ఉండి మనల్ని చెడగొడుతున్నవి టివిలు, సినిమాలు. యువత మనసులో విపరీత పరిణామములు అవుతున్నాయి. వాళ్ళను కుసంస్కారులను చేస్తున్నాయి. దీని అరికట్టడానికి మన పాఠ్యప్రణాళికలో మన సంస్కృతిని ప్రతిబింబించే అంశాలు ఉండాలి. ఇదివరలో రామాయణం, భారతం, నీతిచంద్రిక, పంచతంత్రం నుంచి పాఠ్యా౦శాలు ఉండేవి. ఇప్పుడు అవి అసలు కనపడవు. అలాంటప్పుడు సంస్కృతి, ధర్మం తెలుసుకోవడం ఎలా? సంస్కృతి ధర్మం గురుంచి తెలుసుకునే అవకాశం మనం కల్పించాలి. ప్రసార మాధ్యమాలలో అశ్లీల దృశ్యాలను కానీ, ఆభాసమైన ప్రసంగాలను కానీ రాకుండా చేయాలి. పాఠ్య పుస్తకాలలో సంస్కృతిని ప్రతిబింబించే పాఠాలను చేర్చాలి. అటువంటప్పుడు వైదేశిక శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. అపవ్యాఖ్యానాల వల్ల ఏవిధమైన పరిణామం కాదు. యువకులు ధార్మికులుగా ఉండే అవకాశం ఉంటుంది.